విద్యుత్ సిబ్బందికి సన్మానం
కాకతీయ, ములుగు ప్రతినిధి: లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లంపల్లి సెక్షన్‌లో విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, కట్టర్స్, అన్‌మ్యాన్ సిబ్బంది, సబ్‌స్టేషన్ ఆపరేటర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఎండలోనూ, వర్షంలోనూ, రాత్రింభవళ్లు ప్రమాదాలను లెక్కచేయకుండా పనిచేస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వారి త్యాగానికి నిదర్శనమని అధికారులు కొనియాడారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో తుఫానులు, గాలివానల సమయంలో విద్యుత్ లైన్ల మరమ్మతులు చేయడంలో సిబ్బంది చూపుతున్న నిబద్ధత అభినందనీం అన్నారు. కార్యక్రమంలో మల్లంపల్లి ఏఈ వెంకటేష్, సబ్ ఇంజనీర్ శివ, ఎల్‌ఐలు వీరస్వామి, వెంకటరెడ్డి, లైన్మెన్లు సుధీర్ రెడ్డి, జాఫర్ పాషా, ఏఎల్‌ఎంలు శివశంకర్, షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.


