పన్నుల చెల్లింపుపై
వడ్డీ మాఫీ ఉండదు
ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలి
హన్మకొండ కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్
పన్ను వసూళ్లపై రెవెన్యూ అధికారులతో సమీక్ష
కాకతీయ, వరంగల్: ఆస్తి, నీటి పన్ను చెల్లింపులపై ఎలాంటి వడ్డీ మాఫీ ఉండదని హన్మకొండ కలెక్టర్/బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కార్పొరేషన్‌కు బకాయిగా ఉన్న ఆస్తి, నీటి పన్నులను తక్షణమే చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హన్మకొండ జిల్లా సమీకృత కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బల్దియా రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో పన్ను వసూళ్ల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గతంలో జీహెచ్‌ఎంసీ మాదిరిగా పన్ను చెల్లింపులపై రీబెట్ అవకాశం ఉంటుందని కొందరు అపోహ పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో జీహెచ్‌ఎంసీ అమలు చేసే చట్టాలు, జీడబ్ల్యూఎంసీ అమలు చేసే చట్టాలు వేర్వేరుగా ఉంటాయని స్పష్టం చేశారు. అందువల్ల ఎలాంటి రీబెట్ లేదా వడ్డీ మాఫీ ఉండదని స్పష్టం చేశారు. నగరానికి సంపూర్ణంగా 15వ ఆర్థిక సంఘం నిధులు అందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పన్ను లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని అన్నారు. గతంలో పన్ను లక్ష్యాలను చేరుకోకపోవడం వల్ల కొన్ని మున్సిపాలిటీలకు నిధులు కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు.
బల్దియా పరిధిలో ప్రస్తుతం సుమారు రూ.34 కోట్ల పన్ను బకాయిలు వసూలు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, పూర్తి స్థాయిలో పన్ను వసూళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన వాహనాలు, హోం గార్డుల సహకారం అందించబడుతుందని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి వందశాతం వసూళ్లకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత ఉన్నతాధికారులతో సమన్వయం చేసి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తి పన్నులతో పాటు నీటి (నల్లా) పన్నుల వసూళ్లను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ, రెవెన్యూ అధికారులు శ్రీనివాస్, షహజాది బేగం, బాకం సంతోష్, ఐటి మేనేజర్ రమేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


