గంగస్నానం ఖర్చులు తానే భరిస్తా..
కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం రాచపల్లి–మల్లన్నపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీగట్టుమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గంగస్నానం (గంగపట్నం) కార్యక్రమానికి వచ్చే ఐదు సంవత్సరాలపాటు అయ్యే అన్ని ఖర్చులను తానే భరిస్తానని మల్లన్నపల్లి సర్పంచ్ పసునూటి శ్రీనివాస్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే గంగస్నానం మహోత్సవం అత్యంత విశిష్టమైందని, ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకుని భక్తులు పవిత్ర క్షేత్రమైన కాళేశ్వరానికి వెళ్లడం అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం అని పేర్కొన్నారు. గంగస్నానం ద్వారా గ్రామానికి శాంతి, సౌభాగ్యం, సస్యశ్యామలం కలుగుతాయని భక్తుల నమ్మకం అని చెప్పారు.
ఈ పుణ్యయాత్రలో పాల్గొనే భక్తుల రవాణా, భోజన ఖర్చులను భరించడం అభినందనీయమని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. రాచపల్లి–మల్లన్నపల్లి గ్రామాల భక్తులు తమ వంతు సహాయం అందిస్తూ మార్చి 15న జరిగే జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


