ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం
ఐదు దశల్లో 10 కీలక అంశాల అమలు
రోజువారీ ప్రగతి నివేదికలు.. నోడల్ అధికారుల నియామకం
కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అమలు విధానంపై విస్తృతంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు పది ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి అంశానికి స్పష్టమైన లక్ష్యాలు, సమయపట్టికలు నిర్ధేశించి అమలు చేయాలని సూచించారు.

పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కరణపై ప్రత్యేక దృష్టి
మార్చి 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్ల పరిష్కరణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల సక్రమ నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, ప్రజలకు సమయానుకూల సేవలందించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించినట్లు చెప్పారు. మున్సిపాలిటీల్లో 100 శాతం పన్ను వసూళ్ల లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు అంశంపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు, చిన్నారుల పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.
సంక్షేమం.. పిల్లల భద్రత
ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాల అమలు స్థితిపై సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్‌కు నో కార్యక్రమాన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన రూపంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. మే 4 నుండి మే 9 వరకు వ్యవసాయ అంశంపై వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో రైతులకు సాగు సలహాలు, ఎరువులు, విత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మే 11 నుండి మే 16 వరకు విద్య అంశంపై పాఠశాలల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 18 నుండి మే 23 వరకు యువత క్రీడలు అంశంపై క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టాలని సూచించారు.
మహిళా సాధికారత.. పర్యావరణ పరిరక్షణ
మే 25 నుండి మే 30 వరకు మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణ పరిరక్షణ అంశంపై వృక్షారోపణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ అనుజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి (రెవెన్యూ), వై.వి. గణేష్ (లోకల్ బాడీస్), డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈవో రామ్ రెడ్డి, ఉప కమిషనర్ ప్రసన్న రాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీవోలు ఉమారాణి, సుమ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.*


