నాచారంలో కూల్చిన చోటే అంబేడ్కర్ గద్దె పునర్నిర్మాణం
– అర్ధరాత్రి కూల్చివేతపై గ్రామస్తుల ఆగ్రహం
– పోలీసు బలగాల మధ్య గద్దె పునర్నిర్మాణం
– డీబీఎఫ్ నేత పి. శంకర్ అరెస్టు యత్నం విఫలం
– ఉద్రిక్తత నడుమ అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి
కాకతీయ, గజ్వేల్ : వర్గల్ మండలం నాచారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను ఆర్అండ్బీ అధికారులు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి కూల్చివేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పోలీసు బలగాల మధ్య కూల్చిన చోటే గద్దెను పునర్నిర్మించారు. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు, మహిళలు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా పోలీసులు పి. శంకర్‌ను అరెస్టు చేయడానికి యత్నించగా మహిళలు అడ్డుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. గద్దె నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘటన స్థలానికి గజ్వేల్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు పెద్దఎత్తున చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు పోలీసు బలగాలు మోహరించారు. ఈ సందర్భంగా పి. శంకర్ మాట్లాడుతూ… అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల సాకుతో గద్దె కూల్చివేయడం తగదన్నారు. అర్ధరాత్రి దొంగల్లా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గద్దె కూల్చివేతలో సంబంధిత ఆర్అండ్బీ అధికారులు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు. దళితులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడిషనల్ పోలీస్ కమిషనర్ ఘటన స్థలానికి చేరుకుని సంఘ నాయకులతో చర్చలు జరిపారు. విగ్రహ ఏర్పాటు విషయంలో అనుమతులు తీసుకోవాలని సూచించగా, అంబేడ్కర్ విగ్రహాలకు అనుమతుల అవసరంపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, దళిత సంఘాల నాయకులు, గ్రామ అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.



