కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం
కాకతీయ, హుజురాబాద్ : కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం బుధవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుల్లూరి శోభారాణి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ ఇనుగాలా రాజు, వార్డ్ సభ్యులు శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ పశువైద్యాధికారి డా. ప్లవన్ మజందర్ మాట్లాడుతూ, లింగ నిర్దారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేపడితే ఆడ దూడలు పుట్టే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రైతులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దూడల పెంపకం, పశుగ్రాసాల సాగు పద్ధతులపై కూడా అవగాహన కల్పించారు.శిబిరంలో పశువైద్యాధికారులు డా. ప్లవన్ మజందర్, మండల పశువైద్యాధికారి డా. ఏ. బాలకృష్ణ, శనిగరం పశువైద్యాధికారి డా. వైద్యం విక్రమ్ ఆధ్వర్యంలో పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మొత్తం 108 పశువులు శిబిరానికి రాగా, 28 పశువులకు ఎదుకు రాని సమస్యలపై చికిత్సలు, 32 దూడలకు నట్టల నివారణ మందులు, 6 గేదెలకు కృత్రిమ గర్భధారణ, 68 గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించారు. కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ వెంపటి రాజేశ్వర్ రావు, పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రులు పి. చక్రపాణి, ఎస్. శ్రీనివాస్, ఎండీ సాధిక్, ఏ కుమార్, ఇంటాస్ ఫార్మా కంపెనీ ప్రతినిధి శ్రీకర్, గ్రామానికి చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.


