సైబర్ మోసాలపై అవగాహన
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కాచాపూర్ గ్రామంలో కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజు “సైబర్ జాగ్రత్త దివస్” కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలకు పలు అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ హోటల్ బుకింగ్ హాలిడే ప్యాకేజీల పేరుతో జరుగుతున్న మోసాల గురించి వివరించారు. తక్కువ ధరలకు హోటల్ బుకింగ్, టూర్ ప్యాకేజీలు అందిస్తామని చెప్పి నకిలీ వెబ్‌సైట్లు, లింకుల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని, కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బుకింగ్ చేయాలని సూచించారు. అలాగే సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని లేదా ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో ముందస్తు ఫీజులు తీసుకుని మోసంచేస్తున్న ఘటనలపై ప్రజలను అప్రమత్తం చేశారు. ఇలాంటి ఆఫర్లకు లోనుకాకుండా ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయవద్దని తెలియజేశారు. నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ ద్వారా బ్యాంక్, ఆన్‌లైన్ సేవల పేరుతో ఓటీపీలు, పిన్ నంబర్లు సేకరించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారని హెచ్చరించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


