మనల్ని ఎవర్రా ఆపేది..?!
రెచ్చిపోతున్న ఇసుకాసురులు
నకిలీ వే బిల్లులతో జోరుగా జీరో దందా
ములుగు జిల్లాలోని పలు క్వారీల నుంచి అక్రమ రవాణా
అటవీశాఖ అధికారుల తనిఖీలతో మరోసారి బయటపడ్డ దొంగతనం
తనిఖీలకు దూరంగా..పర్యవేక్షణ ఇసుక రీచ్‌ల ఇష్టానికి
టీజీఎండీసీ అధికారుల వైఖరిపై అనుమానాలు
ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా నిర్లక్ష్యమే
కాకతీయ చేతిలో ఇసుక అక్రమార్కుల చిట్టా
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇష్టమున్నంత తవ్వేస్తాం.. తరలిస్తాం.! మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇసుకాసురులు. ఒకే వే బిల్లులపై పదుల సంఖ్యలో లారీలను అక్రమంగా రాజధానికి తరలించేస్తూ..ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టేస్తున్నారు. ఈ దందా కొత్తదేం కాదు.. పోలీసులు,అటవీశాఖ అధికారులు తనిఖీల్లో పట్టుబడ్డప్పుడు కొద్దిరోజులు గప్‌చుప్ అవుతున్నా.. మళ్లీ షరామాములేఅన్నట్లు మారుతోంది పరిస్థితి. పెద్దపల్లి జిల్లా,ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి నకిలీ వే బిల్లుల దందా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం అటవీ శాఖ అధికారుల తనిఖీల్లో నకిలీ వే బిల్లులతో ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. గతంలోనూ ములుగు జిల్లాలోని పస్రా, ములుగు జిల్లా కేంద్రం, వరంగల్ రింగ్ రోడ్డు, హన్మకొండలోని రాంపూర్, స్టేషన్‌ఘన్‌పూర్ , రఘునాథపల్లి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నకిలీ వే బిల్లులతో ఇసుకను తరలిస్తున్న లారీలను గుర్తించారు.
ఇసుక వినియోగంలో ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పించినా కొందరు లారీ డ్రైవర్లు నకిలీ వే బిల్లులతో నగరానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. బిల్లులపై ఉన్న సమయంతో సంబంధం లేకుండా నదిలో రీచ్‌ల వద్ద పనిచేసే కొందరు సిబ్బంది, లారీ డ్రైవర్లు మిలాఖత్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండుమూడు నెలలుగా నకిలీ వేబిల్లులతో వందల లారీల ఇసుక నగరానికి చేరినట్లుగా తెలుస్తోంది.

ములుగులో మరోసారి బయటపడ్డ బండారం..!
ములుగు జిల్లా ఏజెన్సీ మండలాలైన మంగపేట, వాజేడు, నూగూరు వెంకటాపురం, మండలాలో ఇసుక రీచ్‌ల నిర్వహణ కొనసాగుతోంది. అయితే దీన్ని అదునుగా చేసుకున్న ఇసుక మాఫియా నకిలీ వే బిల్లులు, నకిలీ పత్రాలు సృష్టించి ఇసుక లారీలను జిల్లా కేంద్రాలను దాటిస్తూ జీరో దందాకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లాలో గుట్టుగా నకిలీ వే బిల్లులతో (జీరో) ఇసుక లారీల ను జిల్లా కేంద్రాలను దాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న గోవిందరావు పేట మండలం పస్రా అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టీఏస్08యూఈ8869, టీఏస్30టీఏ3579 అనే నెంబరు గల ఇసుక లారీలు పట్టుబడ్డాయి. గతంలోనూ ఇదే తరహాలో ములుగు జిల్లాలో నకిలీ వే బిల్లులతో జీరో ఇసుక దందా కొనసాగగా చివరకి ఉన్నత స్థాయి అధికారుల రంగ ప్రవేశంతో భారీగా ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు తెటతెల్లమైంది.
మిగతా జిల్లాల్లోనూ ఇదే దోపిడీ !
నిజామబాద్ ఉమ్మడి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ జోరుగా సాగుతోందన్న ఆరోపనలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల ప్రాంతంలోని రీచ్‌ల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ దందాకు అధికార పార్టీలోని కొంతమంది నేతలు సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అధికార పార్టీకి చెందని ప్రజాప్రతినిధుల అండదండలున్నాయని, మా వెనుక ఎవరున్నారో తెలుసా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో అధికార వర్గాలు సైతం భయాందోళన చెందడం.. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న వైఖరితో వెళ్తుండటం గమనార్హం.
ఇసుక రీచ్‌ల నిర్వహణ, ఇసుక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంది అదేశాలను జారీ చేసినా క్షేత్ర స్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. క్వారీల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారుల తనిఖీలు కొరవడడంతో గుట్టుగా జీరో దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి రావాల్సిన ఖజనాకు అక్రమార్కులు గండి కొడుతున్నారు.

ములుగులో బయటపడిందిలా..!
నూగూరు వెంకటాపురం పరిధిలో కొనసాగుతున్న ఇసుక రీచ్ యజమానికి సొంతంగా లారీ ఉంది. హైదరాబాద్‌లో లారీ ఉన్న మరో మిత్రుడితో కలిసి నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణాకు తెరలేపాడు. ఇందులో భాగంగానే సోమవారం(25-08-2025) రోజున హైదారాబాద్‌లోని మిత్రుడు ఘట్కేసర్ సమీపంలో తన ఇసుక లారీ డ్రైవర్‌కు రెండు నకిలీ వే బిల్లులు అందజేసి నూగూరు వెంకటాపురంలోని రీచ్‌కు పంపించాడు. అయితే మరు నాడు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆ ఇసుక రీచ్‌లో రెండు లారీలలో ఇసుక లోడింగ్ చేసి తరలిస్తుండగా గోవిందరావు పేట మండలం పస్రా చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా పట్టుబడ్డారు. అయితే పట్టుబడిన లారీలపై శాఖ పరమైన కేసు నమోదు చేశారు.
తనిఖీలు నిర్వహిస్తున్నాం :
పంజాల భాస్కర్ గౌడ్, ఎఫ్ఆర్వో, ఏటూరునాగారం
చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం చెకింగ్ నిర్వహిస్తున్నాం. ఖచ్చితమైన వివరాల కోసం ఏటూరునాగారం, పస్రా రెండు చెక్ పోస్ట్‌ల వద్ద పలుమార్లు చెకింగ్ నిర్వహిస్తున్నాం. అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడితే శాఖ పరమైన చర్యలకు వెనకాడేది లేదు.
ప్రత్యేక నిఘా పెట్టాం : ఏస్ఐ రాజ్‌కూమార్, ఏటూరునాగారం
ములుగు జిల్లా ఏస్పీ అదేశాల మేరకు ఇసుక రవాణాపై నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాం. ఓవర్ లోడ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ అంతరాయం కలిగేలా రోడ్లపై ఇసుక లారీలు నిలిపిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నాం.


