కాకతీయ, వీణవంక : పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ కథనం మేరకు.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు ఇంటి నిర్మాణానికి హౌస్ నెంబర్ కేటాయించడానికి రూ.20 వేల లంచం కావాలని బాధితుడిని డిమాండ్ చేశాడు.
బాధితుడు ఈ విషయం పై ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం పంచాయతీ కార్యదర్శి బాధితుడి నుండి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం దాడి చేసి కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఏస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 నెంబర్‌కి సమాచారం అందించాలని, ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని డీఎస్పీ స్పష్టం చేశారు.
కాగా కార్యదర్శి నాగరాజు ఏసీబీ పట్టుబడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని పటాసులు కాల్చారు. అంతే కాకుండా డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడిస్తున్న సమయంలో గ్రామస్తులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.


