కొమ్మాల జాతరలో ప్రభల హోరు..
జాతరలో రాజకీయ ఆధిపత్య రంగు..!
భక్తులతో కిటకిటలాడిన జాతర ప్రాంగణం
కొండా వర్గీయుల భారీ ప్రభకు విశేష ఆదరణ
బీఆర్ఎస్ ప్రభను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాంగ్రెస్ ప్రభను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి
ఆత్మకూరు ప్రభతో ఇనుగాల హాజరు..!
బాణసంచా మోతలతో మార్మోగిన గీసుగొండ జాతర ప్రదేశం
కాకతీయ, గీసుగొండ : కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక జాతరలో ప్రభల పోటీ ఈసారి మరింత వేడెక్కింది. భక్తి ఉత్సాహం, రాజకీయ ఆర్భాటం కలిసి జాతరకు ప్రత్యేక వన్నె తెచ్చాయి. గ్రామం నలుమూలలతో పాటు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాలను నింపేశారు. డప్పుల మోతలు, బాణసంచా శబ్దాలు, వేషదారుల విన్యాసాలతో జాతర ప్రాంగణం పండుగ కాంతులతో కళకళలాడింది. వివిధ రాజకీయ వర్గాలు ప్రతిష్టాత్మకంగా ప్రభలను ఏర్పాటు చేశాయి. ఎత్తైన నిర్మాణాలు, రంగురంగుల దీపాలంకరణలతో ప్రభలు రాత్రి వేళల్లో కాంతుల హారాన్ని విరజిమ్మాయి. ప్రభల ముందు కుటుంబాలతో కలిసి భక్తులు ఫోటోలు దిగుతూ సందడి చేశారు.

కొండా ప్రభకు ప్రత్యేక ఆకర్షణ
కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన భారీ ప్రభ ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎత్తైన నిర్మాణంతో, వెలుగుల అలంకరణతో ప్రత్యేకంగా కనిపించింది. ప్రభ ముందు యువకులు డప్పుల మోతకు అనుగుణంగా నృత్యాలు చేయగా, భక్తులు చప్పట్లతో ప్రోత్సహించారు. బాణసంచా ప్రదర్శనతో ఆకాశం రంగుల కాంతులతో మెరిసిపోయింది. ఈ ప్రభను చూసేందుకు ప్రత్యేకంగా జనసందోహం కనిపించింది. జాతరలో వేషధారణలతో వచ్చిన కళాకారులు సందడి చేశారు. పురాణ పాత్రలు, వీరభద్రుడు, శివతాండవ వేషాలతో కళాకారులు విన్యాసాలు చేసి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు, మహిళలు వారితో ఫోటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక కళాకారులకు జాతర మంచి వేదికగా నిలిచింది.

రాజకీయ ప్రభల పోటీ
కాంగ్రెస్ వర్గీయుల ప్రభను రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని, ప్రజల ఐక్యతకు నిలువెత్తు నిదర్శనాలని ఆయన అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జాతరలు బలమని పేర్కొన్నారు. ఆయన రాకతో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ తరఫున ఏర్పాటు చేసిన ప్రభను ప్రారంభించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు భారీగా హాజరై ప్రభ ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించాయి.

వెంకట్రామ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
కొమ్మాల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామంలో ముస్తాబు చేసిన “ప్రభ బండి”ని హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రారంభించారు. అక్కెంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య ఆధ్వర్యంలో ప్రభ బండిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. ప్రభ బండికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి నామస్మరణల మధ్య ప్రారంభోత్సవం జరిగింది.


ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, మన ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే కొమ్మాల జాతరలో ప్రభ బండ్ల ఊరేగింపు విశిష్ట స్థానం కలిగి ఉందన్నారు. స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభ బండి ప్రారంభంతో గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. భక్తులు జయజయధ్వానాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


