కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం
డిస్మిస్ ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలి
కమిటీ సమావేశాలు వాయిదా వేయడం సరికాదు
యాజమాన్యం వైఖరిపై ఏఐటీయూసీ ఆగ్రహం
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కార్మిక సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సింగరేణి సంస్థకు నూతన సి అండ్ ఎండీగా జ్యోతిబుద్ధ ప్రకాష్ బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమేనని పేర్కొన్న రంగయ్య, అయితే స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయి సమావేశం, ప్రతి మూడు నెలలకు ఒకసారి సి అండ్ ఎండీ స్థాయి సమావేశం గుర్తింపు సంఘంతో నిర్వహించాల్సి ఉందని గుర్తుచేశారు. అయితే యాజమాన్యం ఈ సమావేశాలను పదేపదే వాయిదా వేస్తోందని విమర్శించారు. ఇది కార్మికుల సమస్యల పరిష్కారాన్ని ఆలస్యం చేస్తోందని తెలిపారు. మెడికల్ బోర్డు సక్రమంగా నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వైద్య సేవల్లో జాప్యం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. సొంత ఇల్లు పథకాన్ని అమలు చేయాలని, మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆదాయ పన్నును కోల్ ఇండియా తరహాలో యాజమాన్యమే భరించాలని సూచించారు. డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి.రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా సహాయ కార్యదర్శి గట్టయ్య, నాయకులు చందయ్య తదితరులు పాల్గొన్నారు.


