అడవులను రక్షించాలి
వన్యప్రాణులను కాపాడుకోవాలి
ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏటూరునాగారం బస్టాండ్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ.. అడవులను సంరక్షించడం, అడవుల్లో నివసించే వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కలు మానవాళికి అమూల్యమైన వరమని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల వేట, అడవుల నరికివేత వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే తరాలకు అడవులు, వన్యప్రాణులు, ఔషధ మొక్కలు అందేలా సంరక్షణ బాధ్యత మనందరిదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.


