జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు…
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన
ఎస్పీ మహేష్ బీ గీతే డాన్స్
కాకతీయ, సిరిసిల్ల టౌన్: రంగుల పండుగ హోలీ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఉదయం నుంచే కార్యాలయ ప్రాంగణం రంగుల జల్లులతో, పాటల సందడితో మార్మోగింది.విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసులు కాసేపు ఒత్తిడిని పక్కనబెట్టి ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతే డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సిబ్బందితో కలిసిమెలిసి రంగులు చల్లుకుంటూ, పాటలకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు.ఎస్పీతో కలిసి సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు డాన్స్ చేయడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.అధికారి సిబ్బంది మధ్య ఉన్న అనుబంధం, స్నేహభావం ఈ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది.జిల్లాలోని అన్ని మండలాల నుంచి సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు మరియు ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఆటపాటల్లో పాల్గొన్నారు.పరస్పరం రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్ కుటుంబం ఒకటే అన్న భావనతో అందరూ ఉత్సాహంగా వేడుకలను ఆస్వాదించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బీ. గీతే మాట్లాడుతూ, క్రమశిక్షణతో పాటు పరస్పర అనుబంధం కూడా పోలీస్ వ్యవస్థలో అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పండుగలు సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందిస్తాయని తెలిపారు.ఇదే ఉత్సాహం, ఐక్యతతో ప్రజాసేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రంగుల హోలీతో సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం పండుగ వేదికగా మారి ఆనందోత్సాహాలతో మార్మోగింది. ఎస్పీ పాల్గొనడం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపింది.వేడుకల్లో ఎస్పీ తో పాటు డీఎస్పీ నాగేంద్ర చారి,సీఐ లు ,ఎస్సైలు,కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


