కాకతీయ, ములుగు : ములుగు జిల్లాలో శుక్రవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో ములుగు జిల్లాను ముందంజలో నిలుపుతానని మంత్రి సీతక్క అన్నారు.
శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలలో సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా ములుగు మండలం జగ్గన్నపేటలో రూ.35 లక్షల నిధులతో అంతర్గత సి.సి. రోడ్లు నిర్మించనున్నామన్నారు. అనంతరం 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం పనులకు శంకుస్థాపన, ములుగు మండలం ఇంచర్లలో రూ.20 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి, వెంకటపూర్ మండలం జవహర్‌నగర్లో టి.జి. మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో రూ.4.5 లక్షలతో కిచెన్ షేడ్ నిర్మాణం, అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.12 లక్షలతో అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేశారు.
గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో రూ.45 లక్షల నిధులతో అంతర్గత సి.సి. రోడ్లు, డ్రెయినేజ్ పనులకు శంకుస్థాపన, దుంపల్లిగూడెంలో రూ.10 లక్షలతో అంతర్గత సి.సి. రోడ్డుకు శంకుస్థాపన చేసి, పస్రా గ్రామంలో రూ.55 లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సి.సి. రోడ్లు , కాలువలను, అలాగే ఓల్డ్ బోడ్రాయ్ నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు రూ.20 లక్షలతో నిర్మించిన సి.సి. రోడ్డు ను ప్రారంభించారు.


