కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో రూ.300 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీటి అభివృద్ది పనులు చేపడుతున్నామని రామగుండం నియోజక వర్గంఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజక వర్గంలో ఎమ్యెల్యే రూ.కోటి 97 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పనులు ఏన్టీపీసీ ట్రాన్స్‌ఫర్ నిధులో ఇందిరమ్మ కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కృష్ణ నగర్, శ్రీ నగర్ కాలనీ, మల్లాపూర్, ప్రశాంత్ నగర్ ప్రాంతాలలో చేపడుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమాలను సమన్వయంతో ముందుకు తీసుకవెళ్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సహకారంతో రామగుండం నియోజకవర్గంలో విస్తృతమైన అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అలాగే రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ప్రారింభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 4,687 కొత్త తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశామని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.7.50 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందిస్తూ, ప్రజల జీవిత స్థాయిని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అరుణ శ్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


