కాకతీయ ఎఫెక్ట్..!
కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు
వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా నియామకం
14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
మార్చి 2 నుంచి 9 వరకు కమిటీ బాధ్యతలు

కాకతీయ, గీసుగొండ : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జాతరకు ఉత్సవ కమిటీని నియమిస్తూ తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. “ఉత్సవ కమిటీ ఉన్నట్టా..? లేనట్టా” అని పేర్కొంటూ కాకతీయలో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. ఈ కథనానికి దేవాదాయ శాఖ అధికారులు, మంత్రికొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోమవారం ఉదయం నుంచి కసరత్తు చేసిన అధికారులు.. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం 14 మంది సభ్యులతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. కొమ్మాల గ్రామానికి చెందిన వీరాటి రవీందర్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించగా, అజ్మీరా సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మండ రమేష్, బడావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనేల మల్లేష్, మండల నరేష్, మోర్తాల రాజు, డుకేరా వినయ్, మామునూరి వనిత, నాగిరెడ్డి నాగన్నలను డైరెక్టర్లుగా నియమించారు. ఈ ఉత్సవ కమిటీ మార్చి 2, 2026 నుంచి మార్చి 9, 2026 వరకు బాధ్యతలు నిర్వహించనుంది. జాతరను శాంతియుతంగా, సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఉత్తర్వుల్లో ఆదేశించారు. అధికారికంగా కమిటీ నియామకం జరగడంతో ఉత్సవాల నిర్వహణపై ఉన్న అనుమానాలకు ముగింపు పలికినట్లయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
.


