శ్మశాన వాటిక సమస్యపై కలెక్టర్కు వినతి
ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ డిమాండ్
సత్వర పరిష్కారం చేస్తామని కలెక్టర్ హామీ
కాకతీయ, బోనకల్ : మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామ ఎస్సీ స్మశాన వాటిక సమస్యపై గ్రామ సర్పంచ్ మంద కరుణ సోమవారం ఖమ్మం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికు వినతిపత్రం సమర్పించారు. స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురైందని, కొంతమంది అడ్డంగా దారులు తీసి అవ్యవస్థ సృష్టిస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. స్మశాన వాటికకు సరిహద్దు గుర్తులు ఏర్పాటు చేయాలని గతంలో తహసిల్దార్ రమాదేవికి వినతిపత్రం అందజేసినా స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్మశాన వాటిక భూమిని రక్షించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు ఇరుగు జానేష్, పదో వార్డు సభ్యుడు ముత్తారం రవి, ముత్తరపు దేవస్వామి, ముత్తరపు చందు, ఇరుగు ఏసుపాదం, మంద సత్యానందం, కొత్తపల్లి జాను తదితరులు పాల్గొన్నారు.


