ఏనుమాముల మార్కెట్ లో గలాట!
పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం!
మార్కెట్లో ఆలస్యంగా మొదలైన లావాదేవీలు!
కాకతీయ, వరంగల్ : ఏనుమాముల మార్కెట్ లో గలాటా జరిగింది. అడ్తిదారులు, పోలీసుల చర్యల మధ్య రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. సోమవారం ఉదయం 7 గంటలకు కావాల్సిన జెండా పాట 10 గంటలకు మొదలైంది. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి.
అసలు ఏం జరిగింది? సోమవారం ఉదయం వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో అనూహ్యంగా లావాదేవీలు నిలిచాయి. దీనిపై ఆరా తీస్తే.. వరంగల్ మార్కెట్ అడ్తీదారులు భూపాలపల్లి పోలీసులకు మధ్య వివాదంగా తెలిసి రైతులు ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భూపాలపల్లి నుంచి దొంగ సరుకు..
సోమవారం మార్కెట్లో వ్యాపారులు ధర్నా చేయడానికి అసలు కారణం.. భూపాలపల్లి లో ఇటీవల మిర్చి దొంగతనం జరిగిందని అక్కడి రైతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తోంది. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు దొంగలను పట్టుకొని విచారణ చేపట్టగా వరంగల్ లో అడ్తిదారులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వ్యాపార నిరసన!
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అడ్తిదారులను అదుపులోకి తీసుకోగా, అవమానంగా భావించిన వ్యాపారులు సోమవారం మార్కెట్లో నిరసనకు దిగారు. దీనిపై ఆగ్రహానికి గురైన రైతులు అధికారులతో మాట్లాడడానికి మార్కెట్ ఆఫీస్ కు బయలుదేరారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు రైతులను గేట్ల వద్దే అడ్డుకున్నారు. దీంతో ఆఫీసు గేట్ల వద్ద రైతులు నిరసన తెలిపారు. చివరకు డిఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి మల్లేశం, ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ కు విషయాన్ని వివరించారు. కాగా, వారు ఇటు వ్యాపారులతో అటు పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు.

మూడు గంటలు లేట్!
సోమవారం వరంగల్ మార్కెట్ లో అడ్తిదారులు, వ్యాపారులు నిరసన చేపట్టగా సుమారు మూడు గంటలు ఆలస్యంగా లావాదేవీలు సాగాయి. ఫలితంగా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు.


