గగనతలం మూత… విదేశీ ప్రయాణికుల కష్టాలు
పూర్తిగా నిలిచిపోయిన గల్ఫ్ దేశాల మార్గాలు
వందలాది విమానాలు రద్దు.. అమెరికా, యూరప్ ప్రయాణికుల అవస్థలు
దుబాయి, దోహాలో నిలిచిపోయిన వేలాది మంది
చుక్కలనంటుతున్న విమాన టికెట్ ధరలు
ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట
ప్రత్యేక విమానాలపై ఆశలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ గగన రవాణాపై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలు గగనతలాన్ని మూసివేయడంతో విమాన సర్వీసులు దాదాపు స్థంభించాయి. ఇరాన్, ఇరాక్, బహ్రైన్, ఇజ్రాయిల్, జోర్దాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా విమానాల రాకపోకలకు నిషేధిత ప్రాంతాలుగా మారాయి. దీంతో భారతదేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నగరాల నుంచి గల్ఫ్ మార్గం మీదుగా ప్రయాణించే వారు మధ్యలోనే చిక్కుకుపోయారు. దుబాయి, అబుదాబి, దోహా వంటి ప్రధాన మార్గమధ్య కేంద్రాల్లో అనేక మంది ప్రయాణికులు నిలిచిపోయి ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ మార్గం మూసివేయడంతో ప్రత్యామ్నాయ రూట్ల కోసం ప్రయాణికులు ప్రయత్నాలు ప్రారంభించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్ మార్గం మీదుగా యూరప్ చేరుకుని అక్కడి నుంచి అమెరికాకు వెళ్లే మార్గాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ మార్గాల్లో కూడా పరిమిత విమానాలే ఉండటంతో సీట్ల కొరత తలెత్తింది. ప్రయాణ ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

దుబాయిలోనే వేలాది మంది నిలిచిపోయారు
గల్ఫ్ దేశాల్లో ట్రాన్సిట్ వీసాలపై ప్రయాణిస్తున్న వారు మధ్యలోనే నిలిచిపోయారు. హోటళ్లలో గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నవారూ ఉన్నారు. ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. కొందరు టికెట్లు మార్చుకోవడానికి గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి రావొచ్చని అంచనా. కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారు. అమెరికా, యూరప్ నుంచి భారత్కు రావాల్సిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రాచ్య మార్గం నిలిచిపోవడంతో ప్రత్యక్ష విమానాలపై ఒత్తిడి పెరిగింది. కొన్ని దేశాలు ప్రత్యేక విమానాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితి మరింత విషమిస్తే అంతర్జాతీయ గగన రవాణాపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లాల్సిన వారు అధికారిక ప్రకటనలను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితి చల్లబడే వరకు విమాన సర్వీసులు పరిమితంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.


