సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి
ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ పండుగను ప్రశాంత వాతావరణంలో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా సహజసిద్ధమైన రంగులనే ఉపయోగించాలని, హానికర రసాయనిక రంగులను వాడరాదని సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించకూడదన్నారు. ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ బృందాలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత అతివేగం నివారించాలని, ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని సూచించారు. హోళీని సురక్షితంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.


