విన్నవించాం..పరిష్కరించండి
ఉమ్మడి జిల్లాల్లో ప్రజావాణికి వినతుల వెల్లువ
అర్జీల పెండింగ్‌కు నో
నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని కలెక్టర్ల ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్/పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల/జగిత్యాల : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు ప్రజల నుంచి గణనీయ స్పందన లభించింది. వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో వినతులు అందగా జిల్లా కలెక్టర్లు స్వయంగా అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు తక్షణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని, పెండింగ్‌ను సహించబోమని హెచ్చరించారు.
కరీంనగర్ : 345 వినతులు, శాఖల వారీ సమీక్ష
కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 345 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రతి అర్జీపై క్షేత్రస్థాయి విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ అంశాలను సమీక్షిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు.
పెద్దపల్లి : భూ, గృహ సమస్యలపై దృష్టి
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అసైన్‌మెంట్ భూముల పట్టాలు, వారసత్వ మార్పిడి, డబుల్ బెడ్ రూమ్ గృహాల మంజూరు, దివ్యాంగ కోటా, వైద్య సహాయం వంటి అంశాలపై వినతులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల : 164 అర్జీలు, రెవెన్యూ అధికం
రాజన్న సిరిసిల్లలో ప్రజావాణికి 164 దరఖాస్తులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణానికి 25, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు 13 చొప్పున వినతులు వచ్చాయి. ఇతర శాఖలకు కూడా పలు అంశాలపై అర్జీలు అందాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల : 62 ఫిర్యాదులు, సమగ్ర విచారణకు ఆదేశం
జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 62 ఫిర్యాదులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా స్వీకరించిన వినతులను సానుకూలంగా పరిశీలించి చట్టబద్ధంగా న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


