ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన
రేడియేషన్ భయం… అనుమతులపై అనుమానాలు
సాయినగర్‌లో టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా అందోళన
కాకతీయ, మణుగూరు : మణుగూరు మండలాల్లో ఇండ్ల మధ్య సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. జనావాసాల నడుమ టవర్లు నిర్మించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో టవర్ల సంఖ్య కూడా అధికమవుతోంది. అయితే ఇవి నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం సరైనదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అనారోగ్యానికి గురవుతారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్షుల ఉనికి తగ్గిపోవడానికి కూడా ఇదే కారణమని కొందరు చెబుతున్నారు.

ఇండ్ల మధ్య టవర్ల ఏర్పాటు
మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. టవర్ నిర్మించబోయే ప్రదేశానికి చుట్టుపక్కల యాభై మీటర్ల పరిధిలో అనేక ఇళ్లు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో టవర్ ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని స్థానికులు మండిపడుతున్నారు.టవర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన విధానంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు సరైన పరిశీలన లేకుండా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపుల కోసం ఇండ్ల మధ్య టవర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కొందరు నాయకులు విమర్శిస్తున్నారు.
రేడియేషన్ వల్ల ప్రాణాలకు ముప్పు…?
జనావాసాల మధ్య ఉన్న టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కొందరు మేధావులు చెబుతున్నారు. ఐదు వందల నుంచి వెయ్యి మీటర్ల పరిధిలో ప్రభావం ఉంటుందని అంటున్నారు. క్యాన్సర్, నిద్రలేమి, నరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భయపడుతున్నారు.అలాగే పటిష్ఠంగా లేని భవనాలపై భారీ బరువున్న టవర్లు ఏర్పాటు చేయడం భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. జనావాసాల మధ్య టవర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.సాయినగర్ ప్రాంత ప్రజలు టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తమ అభ్యర్థనలను పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతామని, అవసరమైతే టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.జనావాసాల మధ్య సెల్ టవర్ల ఏర్పాటుపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి ప్రజల్లో నమ్మకం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి ప్రజల అనుమానాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.


