సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు
ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ
ధర్మారంలో క్రీడా మైదానం ఏర్పాటు
నందిమేడారం 100% సోలార్ గ్రామంగా అభివృద్ధి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, పెద్దపల్లి : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని కబ్జాకు గురైన సర్కారు భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఇంటింటికి సోలార్ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మండలంలోని నర్సింగాపూర్, ఖీలావనపర్తి, ధర్మారం గ్రామాల్లో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు గుర్తించామని రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని మంత్రి సూచించారు. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని తెలిపారు.
ధర్మారంలో క్రీడా మైదానం
ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం కోసం కేటాయించిన స్థలాన్ని 15 రోజుల్లో చదును చేసి క్రికెట్, వాలీబాల్, వాకింగ్ ట్రాక్‌కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు. ధర్మారం మండలంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని మంత్రి తెలిపారు.
నందిమేడారం 100% సోలార్ గ్రామం
ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి సోలార్ పథకాన్ని గ్రామస్తులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో నందిమేడారం గ్రామాన్ని 100 శాతం సోలార్ గ్రామంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలి విడతలో గృహ అవసరాల కోసం 1486 విద్యుత్ కనెక్షన్లకు రెండు కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నామని, రెండో విడతలో 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాన్ని సంపూర్ణ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.51 కోట్లు విడుదల చేసిందని, విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.36 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో తాగునీటి సమస్యలు లేకుండా బోర్ బావులు తవ్వించామని, నందిమేడారం గ్రామంలో 80 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.


