కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్కూల్ ట్రాన్స్‌పోర్టేషన్ కారణంగా వస్తున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం స్కూల్ యాజమాన్యాలతో సమావేశమయ్యారు. కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజారావు భూపాల్ ఐపీఎస్ నేతృత్వం వహించారు.
సమావేశంలో విద్యార్థులు ఎక్కువగా స్కూల్ వాహనాలనే వినియోగించేలా ప్రోత్సహించడం, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, స్కూల్ సమయాల్లో వ్యత్యాసం పాటించడం, కార్‌పూలింగ్ ప్రోత్సాహం, బస్సు డ్రైవర్లపై నిరంతర ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలు చర్చించారు.
తల్లిదండ్రులకు స్పష్టమైన ప్రయాణ మార్గదర్శకాలు ఇవ్వాలని, ట్రాఫిక్ పోలీసులు, యాజ మాన్యాలు, తల్లిదండ్రులు కలిసి సురక్షిత ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సమావేశంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సిఎస్సి సీఈఓ నావేద్ ఖాన్‌తో పాటు శాంతా మరియా, ఫినిక్స్ గ్రీన్స్, గ్లోబల్ ఎడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చిరెక్, మెరీడియన్, ఓక్ రిడ్జ్, ఎన్ఏఎస్ఆర్, శ్రీనిధి, బిర్లా ఓపెన్ మైండ్స్, పల్లవి తదితర పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.


