బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు
బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
రెబల్స్ చేరిక, డిప్యూటీ మేయర్ ఎంపికపై తీవ్ర విమర్శలు
మహిళ కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని ఆరోపణ
కాకతీయ, కరీంనగర్ : ధర్మం పేరుతో రెండుసార్లు ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన బండి సంజయ్ ప్రస్తుతం ధర్మం తప్పుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకత్వంపై ఆరోపణలు చేశారు. రెబల్‌గా పోటీ చేస్తే 15 సంవత్సరాలు సస్పెండ్ చేస్తామని చెప్పిన బండి సంజయ్ అదే ధర్మం పేరుతో రెబల్స్‌ను బీజేపీలో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఓట్లతో బీజేపీ 30 సీట్లు గెలిచినప్పటికీ డిప్యూటీ మేయర్ పదవిని మహిళలకు ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. బీజేపీ నుంచి గెలిచిన 19 మంది మహిళ కార్పొరేటర్లలో ఎవ్వరూ అర్హులు కారా అని ప్రశ్నించారు. మాజీ మేయర్ సునీల్ రావును గతంలో అవినీతి పరుడని విమర్శించిన బండి సంజయ్ ఇప్పుడు అదే వ్యక్తిని డిప్యూటీ మేయర్‌గా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఇది ధర్మానికి విరుద్ధం కాదా అని అన్నారు.
చిత్తశుద్ధి ఉంటే..
బీఆర్‌ఎస్ హయాంలో 51వ డివిజన్‌లో రూ.16 లక్షలతో మంజూరైన పనిని తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేంద్రమంత్రి హోదాలో నిధులు తెచ్చే శక్తి ఉంటే ఆయన నివాస ప్రాంతంలో వేసిన రోడ్లు మున్సిపల్ జనరల్ ఫండ్‌తో ఎందుకు వేశారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి బీజేపీ 30 సీట్లు గెలిచిందని ఆరోపించారు. ధర్మం తప్పిన బండి సంజయ్‌ను ఆయన నమ్మే అమ్మవారు కూడా క్షమించరని వ్యాఖ్యానించారు.కేంద్రమంత్రి హోదాలో చిత్తశుద్ధి ఉంటే పార్టీలకు అతీతంగా 66 మంది కార్పొరేటర్లను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్ అంటూ ఆయన పట్ల బండి సంజయ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ అనూప్, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆరే రవి గౌడ్, చేతి చంద్రశేఖర్, బండ శ్రీకాంత్, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, హనుమల్ల ఉమాశంకర్, యూత్ నాయకుడు సత్తినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


