ఇక రవీంద్రభారతిలో ఆన్లైన్ బుకింగ్లు
నూతన వెబ్సైట్ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఇంటి నుంచే హాల్ స్లాట్ రిజర్వేషన్ సౌకర్యం
కాకతీయ, హైదరాబాద్ : చారిత్రక రవీంద్రభారతిలో కళా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే వారికి ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై హాల్ బుకింగ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే వెబ్సైట్ ద్వారా స్లాట్లను బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ సాంకేతికత వినియోగంతో బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. నిర్వాహకులు తమకు కావలసిన తేదీ ఖాళీగా ఉందో లేదో స్వయంగా పరిశీలించి, స్లాట్ అందుబాటులో ఉంటే వెంటనే చెల్లింపు చేసి రిజర్వ్ చేసుకోవచ్చని వివరించారు. స్లాట్ ఖాళీ లేకపోతే ‘వెయిటింగ్’లో ఉంచి, ఖాళీ ఏర్పడినప్పుడు ప్రాధాన్యత క్రమంలో సమాచారం అందిస్తారని తెలిపారు. రవీంద్రభారతిలో 1036 సీట్ల మెయిన్ హాల్, 120 సీట్ల మినీ హాల్, 100 సీట్ల పైడి జయరాజ్ థియేటర్లను ఈ సౌకర్యంతో బుక్ చేసుకోవచ్చు. రోజుకు మూడు స్లాట్లు ఉండగా, 90 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. కార్యక్రమంలో భాషా, సాంస్కృతిక శాఖ అధికారులు పాల్గొన్నారు.


