కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు
చిన్నారి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు కోరిన కవిత
నిందితులను శిక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక
కాకతీయ, లక్డీకపుల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనలో రెండు నెలల పసి బిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహరాజ్ తదితరులు డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలు మౌనిక, గణేశ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన కవిత ఘటనను ఖండించారు. చిన్నారి మరణానికి న్యాయం జరిగేలా బాధిత కుటుంబం పోరాటం చేస్తోందని, జాగృతి తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో సరైన సెక్షన్లు నమోదు చేయలేదని ఆరోపించారు. సంఘటనలో ఉన్న వివిధ కోణాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుల వివక్షతో ఇలాంటి దారుణాలు జరగడం బాధాకరమని పేర్కొంటూ, నిందితులను శిక్షించే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


