పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం..
*అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం..
*పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి..
కాకతీయ, గీసుగొండ: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మండలంలోని గంగాదేవిపల్లి, సింగ్య తండా గ్రామాలలో నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వీట్లు తినిపించి,శాలువాలతో సన్మానించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. కొత్త ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబాల సంతోషాన్ని చూసి ఆనందంగా ఉందన్నారు. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాలు లేకుండా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతోందని, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు, పార్టీ నాయకులు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


