మత్స్య కార్మికులకు ఉపాధి పథకాలు
కలెక్టర్ గరిమ అగ్రవాల్
బోయినపల్లి మండలంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
మత్స్య కార్మికులకు పరికరాల పంపిణీ
కాకతీయ, సిరిసిల్ల టౌన్: మత్స్య కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు ఉపాధి పథకాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 లక్షల 91 వేల వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ శ్రీనివాస్, ఎన్‌ఎఫ్‌డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. కన్నప్ప, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్‌వీ మురుగన్, జిల్లా మత్స్య అధికారి సౌజన్య తదితరులు హాజరయ్యారు. కేంద్రాన్ని నర్సింగాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి అందజేశారు.అనంతరం చేప పిల్లల పెంపకం యూనిట్‌ను ప్రారంభించిన కలెక్టర్, ఉత్పత్తి విధానం, సామర్థ్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్య కార్మికులకు చేప పిల్లలకు వినియోగించే దాణా,మందులు, వలలు ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సంఘం సభ్యులు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చొప్పరి రాంచంద్రం, అధికారులు ప్రకాష్ ముత్తు, సునీల్ కుమార్, విద్యాసాగర్ రెడ్డి, రామచంద్రన్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్న అంశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు, పరీక్షా హాలులో అమలు చేస్తున్న నిబంధనలపై అధికారులను ఆరా తీశారు. అలాగే పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి కనీస వసతులు అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్,అధ్యాపకులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.



