మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళల ఆందోళన
ఎక్సైజ్ శాఖకు మహిళా సంఘాల ఫిర్యాదు
కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : నేరెడ్‌మెట్ క్రాస్ రోడ్డులోని శ్రీకాలనీ బస్టాప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో కొనసాగుతున్న ‘9 వైన్స్’ మద్యం దుకాణం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ వి. ప్రసన్న నాయుడు నేతృత్వంలో మహిళలు మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని కలిసి ఫిర్యాదు అందజేశారు. బస్టాప్ వద్ద వేచి ఉండే మహిళలు, విద్యార్థినులపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై గుంపులుగా చేరి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల సమీపంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు. ఎక్సైజ్ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, అవసరమైతే దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని లేదా ఇతర ప్రాంతానికి తరలించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కార్యక్రమంలో పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.


