విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?
పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా?
అర్హతలేని కమిటీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రయోగాలా?
నిర్ణయాలు వెనక్కి తీసుకుని నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి
ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం చెప్పాలి
విద్యా కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమ వేదికలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసలైన విద్యావేత్తలు లేని కమిటీతో కొత్త విద్యా విధానం రూపొందించడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ విద్యా కమిషన్‌లో నిజమైన విద్యావేత్తలు ఎక్కడ?” అని ప్రశ్నించారు. పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా అనుభవం ఉన్న నిపుణులు ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ నేపథ్యం ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లు మినహా, విద్యాశాఖలో డాక్టరేట్ చేసిన వారు కానీ, పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో అనుభవం ఉన్న వారు కానీ కమిటీలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
అర్హతలపై సందేహాలు
కమిటీ చైర్మన్ పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి, పైగా ఇంజనీర్ కావడం గమనార్హమని హరీష్ రావు అన్నారు. పరిపాలనలో అనుభవం వేరని, విద్యార్థుల మనస్తత్వం, బోధనా పద్ధతులపై అవగాహన వేరని స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే బాధ్యతను అనుభవం లేని వారికి అప్పగించడం సరికాదన్నారు. పాఠ్యాంశాలు ఎలా ఉండాలి, బోధనా విధానాలు ఎలా ఉండాలి అనేది నేలమట్టంలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు, విషయ నిపుణులకే బాగా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సంబంధం లేని అధికారులతో కమిటీ వేయడం విద్యావ్యవస్థపై ప్రయోగాలు చేయడమేనని విమర్శించారు.
పారదర్శకతపై డిమాండ్
గత రెండేళ్లుగా విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన హరీష్ రావు, ఇప్పుడు సంబంధం లేని వారితో కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని అన్నారు. కొత్త విద్యా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పారదర్శకత కోరుకుంటున్నారని గుర్తుచేశారు. కమిటీ గొప్పదని చెప్పుకుంటే, దాని నివేదిక ఎంత ప్రామాణికమో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యావ్యవస్థను దెబ్బతీసే నిర్ణయాలను వెంటనే నిలిపివేసి, అనుభవం ఉన్న విద్యావేత్తలు, బాల మనోవిజ్ఞాన నిపుణులు, విషయ నిపుణులకు బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.


