“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”
ప్రజలు ఆకలిని సహించినా ఆధిపత్యాన్ని ఒప్పుకోరు
అమరవీరుల స్ఫూర్తితో విధులు కొనసాగించాలి
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి అవగాహన ఉన్నవారినే చైర్మన్ చేశాం
15 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పోస్టులు భర్తీ
పదవితో వ్యక్తిత్వం కోల్పోవద్దు.. పాలనలో పారదర్శకత పాటిద్దాం
ప్రజలకు సంక్షేమం చేరేలా పని చేయాలి
గ్రూప్–1, గ్రూప్–2 అధికారులకు సీఎం భావోద్వేగ సందేశం
శిక్షణను పూర్తి చేసుకున్న అధికారులకు అభినందనలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గ్రూప్–1, గ్రూప్–2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగభరితంగా ప్రసంగించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అధికారులను అభినందిస్తూ “మీరు మొన్న విద్యార్థులు… నిన్న నిరుద్యోగులు… ఈ రోజు అధికారులు. ఇది మీ కృషి, మీ కుటుంబాల త్యాగాల ఫలితం” అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సేవ చేసే బాధ్యత మీ భుజాలపై ఉందని గుర్తుచేస్తూ పారదర్శకత, నిబద్ధత, కర్తవ్యబోధతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఆకలిని సహించినా ఆధిపత్యాన్ని ఒప్పుకోరని స్పష్టం చేసిన సీఎం, స్వాతంత్ర్యం, స్వాభిమానం కోసం పోరాడిన వీరులను స్మరించారు. రాంజీ గోండు, కొమరం భీం రాజ్యాల కోసం కాదు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. కాకతీయ కాలంలో సమ్మక్క, సారలమ్మ సామాజిక న్యాయం కోసం తిరుగుబాటు చేసి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం అమరవీరులైన వారి స్ఫూర్తి అధికారుల పనితీరులో ప్రతిబింబించాలని సూచించారు. దేశంలో తొలి సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన తెలంగాణ బిడ్డ రావి నారాయణ రెడ్డిని ఉదాహరణగా పేర్కొంటూ ప్రజల ఆశయాలకు ప్రతీకగా నిలిచిన నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షల కోసం సుమారు ఆరు లక్షల మంది పోటీపడగా 582 మంది గ్రూప్–1, 775 మంది గ్రూప్–2 అభ్యర్థులు మాత్రమే ఎంపిక కావడం సాధారణ విషయం కాదని, ఇది మీ ప్రతిభ, పట్టుదల ఫలితమని అభినందించారు.

15 ఏళ్ల తర్వాత గ్రూప్–1 భర్తీ
గత 15 ఏళ్లుగా గ్రూప్–1 పోస్టులు భర్తీ కాలేదని గుర్తుచేసిన సీఎం, ప్రజా ప్రభుత్వం ఆ లోటును తీర్చిందన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలపై అవగాహన ఉన్నవారినే చైర్మన్, సభ్యులుగా నియమించామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్–1లో ఎంపికైన అభ్యర్థుల ఆనందం నిలవకుండా కొందరు కోర్టులకు వెళ్లినా, ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు పోరాడి మెరిట్ ఆధారంగా ఎంపికలను నిలబెట్టిందన్నారు.
అధికారులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని సీఎం హెచ్చరించారు. పదవి వచ్చిన తర్వాత మనిషిగా పతనం కాకూడదన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా చేరేలా చూడాల్సిన బాధ్యత మీది అని స్పష్టం చేస్తూ “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు” అని పేర్కొన్నారు. ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచిన ఎస్.ఆర్. శంకరన్ను తలచుకోవాలని సూచించారు. పేదలకు సహాయం చేసే ముందు తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలని, వారిని గౌరవించాలని అన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 10–15 శాతం కోత పెట్టేలా చట్టం తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. త్వరలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఎంసీఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదరబోతుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పరిపాలన నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలను అధికారులు వినియోగించుకోవాలని సూచించారు. ముగింపులో, ప్రజల ఆశలు, అమరవీరుల స్ఫూర్తి, తల్లిదండ్రుల ఆశీర్వాదాలను గుర్తు పెట్టుకుని పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా సేవ చేయడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెంచాలని సూచించారు.


