కాకతీయ, నేషనల్ డెస్క్: కేరళలోని కన్నూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్రుద్ధ దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. పదునైనా వస్తువుతో కొట్టి చంపారు. అనంతరం డెడ్ బాడీలను కాల్చివేశారు. మరణించినవారు కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ బంధువులుగా పోలీసులు తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలు ఏకే శ్రీలేఖ, ఆమె భర్త ప్రేమరాజన్ లు కన్నూర్ జిల్లాలోని అలవిల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో వీరిద్దరూ ఒంటరిగానే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను చూసేందుకు వస్తున్నట్లుగా ప్రేమరాజ్ కు కుమారుడు కబురు అందించాడు. ఆయనను ఎయిర్ పోర్టు నుంచి తీసుకువచ్చేందుకు కారు కోసం గురువారం సాయంత్రం డ్రైవర్ వీరి ఇంటికి వచ్చాడు.
డోర్ కొట్టినా..ఎంత పిలిచినా వారు స్పందించకపోవడంతో డ్రైవర్ పక్కింటి వారిని అడిగాడు. బుధవారం తర్వాత వారిని తాము చూడలేదని చెప్పారు. దీంతో ఇరుగుపొరుగు సహాయంతో డోర్ బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన డ్రైవర్ కాలిన స్థితిలో ఉన్న డెడ్ బాడీలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి డెడ్ బాడీలను పరిశీలించారు.
శ్రీలేఖ తలపై పదునైన వస్తువుతో కొట్టిన గాయాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంట్లోకి ఎవరూ చొరబడినట్లు ఆనవాళ్లు లేవన్నారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


