మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ: మహిళలు ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం 16వ డివిజన్ జాన్‌పాక పరిధిలోని గోల్డెన్ విల్లా రిసార్ట్‌లో సంగెం, గీసుగొండ మండలాల, బల్దియా పరిధిలోని 15,16,17 డివిజన్లకు చెందిన 50 మంది మైనార్టీ మహిళలకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, కుట్టు మిషన్లు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని అన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


