పెండింగ్‌లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలి..
*టెక్స్టైల్ పార్క్ సందర్శనలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ,గీసుగొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి,పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని మెగా టెక్స్టైల్ పార్క్ ను జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యత,వేగం,సమయపాలన విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు.పార్క్‌లో రహదారుల నిర్మాణం,ఆర్‌ఓబీ బ్రిడ్జ్ పనులు,గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నుండి టెక్స్టైల్ పార్క్‌కు రహదారి మార్గం ఏర్పాటు,విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర మౌలిక సదుపా యాల అభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమగ్రంగా పరిశీలించారు. ప్రతి పనిపై విడివిడిగా అధికారులతో చర్చించి, ప్రస్తుత స్థితి,అంచనా వ్యయం,పూర్తి చేసే గడువు వంటి అంశాలను తెలుసుకున్నారు.పనుల అమలులో ఆలస్యం జరుగకుండా సంబంధిత శాఖలు పరస్పర సమ న్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలంటే మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం లేదా నాణ్యత లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్డీవో సుమ,జిల్లా పరిశ్రమల మేనేజర్ స్వామి,ఆర్&బి శాఖ అధికారులు,నేషనల్ హైవేస్ అథారిటీ ప్రతినిధులు, గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్,సంగెం తహసిల్దార్ జి.రాజ్ కుమార్, హాజరై తమ తమ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు.


