అకాల వర్షాలకు భయపడొద్దు
ఏనుమాముల మార్కెట్‌లో అన్ని వసతులు సిద్ధం
రైతులు పంటను నిర్భయంగా తీసుకురావాలి
వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ
కాకతీయ, వరంగల్ : అకాల వర్షాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ సూచించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తులను సజావుగా అమ్ముకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు మిర్చి పంటను మార్కెట్‌కు తీసుకురావడంలో వెనుకడుగు వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే వర్షాలు కురిసినా మిర్చి బస్తాలు తడవకుండా ఉండేందుకు మార్కెట్‌లో 46 షెడ్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ షెడ్లలో సుమారు 50 వేల నుంచి 80 వేల బస్తాల వరకు నిల్వ ఉంచే సామర్థ్యం ఉందని వివరించారు. అదనంగా 10 వేల టార్పాలిన్ షీట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి భయం లేకుండా తమ పంటను తీసుకువచ్చి అమ్ముకోవచ్చని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులో తాగునీరు, రైతు విశ్రాంతి గృహాలు, టీ–టిఫిన్ కాంటీన్లు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో మార్కెట్ నడుస్తోందని పేర్కొంటూ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


