ములుగుకు మరో ప్రాజెక్టు
“ఇన్‌క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్” కు ఎంపిక
రాష్ట్రంలోనే ఏకైక జిల్లాగా రికార్డు
కాకతీయ, ములుగు ప్రతినిధి: మహిళలు బాలికల భద్రత, గౌరవం, బారియర్-ఫ్రీ మొబిలిటీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్భయ ఫండ్ కింద “ఇన్‌క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్” ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పది పట్టణాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాను ఎంపిక చేయడం విశేషం. బుధవారం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి, డైరెక్టర్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలికల భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతర చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు అమలు విధానం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నత స్థాయి నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ, పట్టణ స్థానిక సంస్థలు, రవాణా శాఖ తదితర విభాగాల సమన్వయంతో డీపీఆర్ సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అవసరమైన పత్రాలతో కూడిన డీపీఆర్‌ను వీలైనంత త్వరగా సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ములుగు జిల్లాలో మహిళలు బాలికలకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమాన అవకాశాలు కలిగిన పట్టణ వాతావరణాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ దివాకర వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, మెరుగైన వీధి వెలుగులు, సురక్షిత రవాణా సదుపాయాలు, మహిళా హెల్ప్‌డెస్క్‌లు, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు ప్రాధాన్యంగా తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) సంపత్ రావు, జిల్లా సంక్షేమ అధికారి ఈ.పి. ప్రేమలత పాల్గొన్నారు.


