సేవాలాల్ ఆశయాలు కొనసాగించాలి
*మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి హరిత హోటల్ పక్కన తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతక్క, కలెక్టర్ దివాకర, గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ…. జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, బంజారా కులస్తులు భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించామని వివరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువు వలననే ఏ జాతి అయినా బాగుపడుతుందని, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ కనబరచాలని, అభివృద్ధి చెందిన వారు మిగతా వారి ఉన్నతికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు పోరిక గోవింద్ నాయక్, పూజారులు రమేష్ గిరి మహారాజ్, కిషన్ మహారాజ్, ఐటిడిఏ అధికారి జనార్ధన్, రాహుల్, బంజారా కులస్తులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


