కాకతీయ, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కొంతమంది ప్రధాని మోదీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో మొహమ్మద్ రిజ్వి అలియాస్ రాజా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సింగ్వారాలోని భాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతందని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరును బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం అసభ్యకరమంటూ ఎక్స్ వేదికగా నితీశ్ కుమార్ పోస్టు చేశారు.
బిహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దుర్బంగా పట్టణంలో నిర్వహించిన సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోదీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు పట్నాలోని కొత్వాలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు పలు అనధికారిక ఖాతాల్లో అప్ లోడ్ చేశారు. అందులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మోదీని హిందీలో దూషిస్తున్నట్లుగా చూపుతున్న వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీన్ని ఖండించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగుస్థాయికి చేరుకున్నాయన్నారు.


