కొమ్మాల జాతరలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు…
*పర్యవేక్షిస్తున్న అధికారులు…
*ఆలయ ప్రాంగణంలో చల్వ పందిర్లు ఏర్పాటు
*కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులు…
*నిరంతర విద్యుత్ సరఫరా కి కొత్త స్తంభాలు లైన్లు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ శాఖ
*పారిశుద్ధ పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీ కార్యదర్శులు
కాకతీయ,గీసుగొండ:ప్రసిద్ధ కొమ్మాల జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జాతరలో పలు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
*అధికారుల నిరంతర పర్యవేక్షణ
కొమ్మాల జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మంగళవారం రోజు జిల్లా కలెక్టరేటులో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం పనులలో వేగం పెరిగింది.జాతర ఏర్పాట్లపై జిల్లా,మండల, గ్రామ స్థాయి అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఎక్కడా లోపాలు లేకుండా సమయానికి పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
*ఆలయ ప్రాంగణంలో చల్వ పందిర్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా చల్వ పందిర్లు ఏర్పాటు చేస్తున్నారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నీడ సౌకర్యం కల్పించేలా పందిర్లు నిర్మిస్తున్నారు. తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక ప్రదేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రసాద్ తెలిపారు.

*ఆలయ శోభకు రంగుల అలంకరణ, లైటింగ్ ఏర్పాట్లు
జాతర వేళ ఆలయానికి మరింత శోభ తీసుకు రావడానికి గుడి గోడలకు, ద్వారానికి రంగులు వేయడం పూర్తయ్యింది. ప్రధాన ద్వారంతో పాటు ప్రాంగణంలోని నిర్మాణాలకు కొత్తగా పెయింటింగ్ చేయడంతో ఆలయం కొత్త కళను సంతరించుకుంది. ప్రస్తుతం రాత్రివేళల్లో ఆలయం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ శాఖ సహకారంతో అలంకార దీపాలు అమర్చుతూ జాతర రోజుల్లో ఆలయం ప్రకాశవంతంగా వెలిగేలా చర్యలు చేపడుతున్నారు.

*కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులు
జాతర ప్రధాన ద్వారం నుండి 400 మీటర్ల బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. నర్సంపేట ప్రధాన రహదారి నుండి కొమ్మాల జాతరకు వెళ్లే రహదారి పనులకు రూ1.45 కోట్లతో ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టగా అందులో 410 మీటర్ల బీటీ రోడ్డు పూర్తికాగా, మరో 400 మీటర్ల బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని గురువారం రోజున బీటీ రోడ్డు పనులు పూర్తి అవుతాయని పిఆర్ డిఈ జ్ఞానేశ్వర్ తెలిపారు.

*నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు
జాతర సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ ఏడి బి.రవి తెలిపారు. కొత్త విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేస్తూ అవసరమైన మరమ్మత్తులు చేస్తున్నారు. రాత్రివేళ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

*పారిశుద్ధ పనులకు ప్రాధాన్యత
జాతర సమయంలో శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ పనులను పర్యవేక్షిస్తూ జాతర ప్రాంగణంలో చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు.భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి పనులు చేపడుతున్నట్లు కొమ్మాల గ్రామ కార్యదర్శి శంకర్ రావు తెలిపారు.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
కొమ్మాల జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపారు.పోలీస్ అవుట్ పోస్ట్,సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి పనులను జాతరలో చేపడుతున్నట్లు సిఐ తెలిపారు.

*సమన్వయంతో విజయవంతమైన జాతర లక్ష్యం
జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.అభివృద్ధి పనులు పూర్తయ్యే సరికి కొమ్మాల జాతర మరింత వైభవంగా నిర్వహించ బడనుందని ఆలయ ఈఓ ప్రసాద్,ఆలయ అర్చకులు కాండూరి రామా చార్యులు తెలిపారు.


