తూతూ మంత్రంగానే కొమ్మాల జాతర ఏర్పాట్లు…
*ఎమ్మెల్యే–మంత్రి వర్గపోరు మాని ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి..
*జాతరలో శాశ్వత సదుపాయాలు కల్పించాలి..
*ఆదాయం,ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
*బిజెపి నాయకుల డిమాండ్..
కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈనెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తూతూ మంత్రంగానే జరుగుతు న్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. బుధవారం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సొంత మండలంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే–మంత్రి మధ్య వర్గపోరు కారణంగా ఆలయానికి వచ్చే భక్తులే ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న కొమ్మాల జాతర అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నిలిచి పోయిందన్నారు.ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేశామని ఎమ్మెల్యే పత్రికా ప్రకటనలు ఇస్తున్నప్పటికీ, వాస్తవానికి రోడ్డు నిర్మాణాలకు కేటాయించిన నిధులను దేవాలయ అభివృద్ధిగా చూపించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. జాతరకు వచ్చే భక్తుల కానుకలను జాతర అభివృద్ధి పనులకు వినియోగించి శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, భక్తుల విశ్రాంతి గదులు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జాతరకు వచ్చే ఆదాయం, ఖర్చుల వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గపోరు మానుకుని ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. విజయచందర్ రెడ్డి,డా.కాళీ ప్రసాద్ రావు,జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు కూతురు రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు, మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్,మండల ప్రధాన కార్యదర్శులు చల్ల రాజు, కందికొండ ప్రదీప్,స్టేట్ కౌన్సిల్ సభ్యుడు గట్టికోపుల రాంబాబు,మండల కార్యదర్శి అల్లం కేదారి,ములుగురి శ్రీనివాస్,సీనియర్ నాయకులు దేవుల నాయక్,మర్రి కుమార్, జల్లెల శివ,తాళ్లపెళ్లి కుమార్,కోట అనీల్,కాందరి మురళి,కొంగర రాయరాకుల శ్రవణ్,ఐలోని నరేందర్,శరత్,కందుల రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.


