అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న సర్పంచ్
*జేసీబీ,మూడు ట్రాక్టర్లు సీజ్
*నలుగురిపై కేసు నమోదు
*తప్పుడు ప్రచారాన్ని ఖండించిన గీసుగొండ సీఐ విశ్వేశ్వర్
కాకతీయ, గీసుగొండ: కొమ్మాల జాతర అభివృద్ధి పనుల నెపంతో సూర్య తండా గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కట్ట నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక సర్పంచ్ రాఘవేంద్ర అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది.జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి మూడు ట్రాక్టర్లలో తరలిస్తున్న వారిని సర్పంచ్ నిలదీశారు. ఎవరి అనుమతితో మట్టి తరలిస్తున్నారని ప్రశ్నించగా, సీఐ అనుమతితోనే మట్టి రవాణా చేస్తున్నామని నిర్వాహకులు బుకాయించినట్లు సమాచారం.దీనిపై సర్పంచ్ రాఘవేంద్ర గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న సీఐ డి.విశ్వేశ్వర్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మట్టి తవ్వి తరలిస్తున్నట్లు నిర్ధారించి ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేశారు.

*మట్టి తరలింపుకు పోలీస్ శాఖకు సంబంధం లేదు…
పోలీస్ శాఖ అనుమతులు పొంది మట్టి రవాణా చేస్తున్నట్టుగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని,అందులో ఎటువంటి నిజం లేదని గీసుగొండ సిఐ విశ్వేశ్వర్ స్పష్టం చేశారు. మట్టి తవ్వకం, రవాణాకు సంబంధిత రెవెన్యూ, గనుల శాఖల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. అక్రమ మట్టి తరలింపులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.ఈ ఘటనలో బుక్క వేణు, నాయనబోయిన రాజు, తుత్తురు రవి, బూర్గుల కొమురయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


