మీడియా ముందుకు దేవ్‌జీ
డీజీపీ బి. శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగుబాటు
ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి, దామోదర్, నూనె నరసింహారెడ్డి సైతం
గుర్తుపట్టలేనంతగా మారిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు
అగ్ర నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేత, పార్టీ జనరల్ సెక్రటరీగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ బి. శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత బహిరంగ వేదికపై ప్రత్యక్షం కావడం భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేవ్‌జీతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (దామోదర్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి (గంగన్న) కూడా లొంగుబాటు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వ నిర్మాణంలో కీలక స్థానాల్లో ఉన్న ఈ నేతల లొంగుబాటు సంస్థకు గట్టి దెబ్బగా విశ్లేషిస్తున్నారు. దాదాపు 44 ఏళ్ల పాటు అండర్‌గ్రౌండ్‌లో కార్యకలాపాలు కొనసాగించిన దేవ్‌జీ వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు, నిరంతర కూంబింగ్ ఆపరేషన్లు, సహచరుల అరెస్టులు వంటి కారణాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు సమాచారం.
మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయనను గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రూపం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, “హింసా మార్గాన్ని విడిచి ప్రధాన స్రవంతిలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. పునరావాస పథకం కింద రక్షణ, ఆర్థిక సహాయం, చట్టబద్ధ జీవనానికి అవసరమైన మద్దతు అందించబడుతుంది” అని తెలిపారు. దేవ్‌జీపై సుమారు రూ.1 కోటి రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ లొంగుబాటుతో తెలంగాణ రాష్ట్ర కమిటీ దాదాపు నిర్వీర్యమైందని, పార్టీ అగ్రనాయకత్వం కుప్పకూలినట్లేనని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ కగార్–2 నేపథ్యంలో భద్రతా దళాలు పట్టు బిగించడంతో అగ్రనేతలపై ఒత్తిడి పెరిగిన దశలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి చట్టపరమైన ప్రక్రియల అనంతరం పునరావాస చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.



