కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం 80 శాతం దాటాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్, కేజీబీవీ ప్రిన్సిపాళ్ల తో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాశాఖపై సమీక్షించారు.
ఈ సందర్భంగా అన్ని మండలాల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరును సమీక్షించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరు 80% దాటాలని, ఆదిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షం వంటి కారణాలవల్ల కాస్త ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పాఠశాలకు అనుమతించాలని సూచించారు. ఏ పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు ఎక్కువగా ఉంటే అక్కడ విద్యార్థుల హాజరు కూడా ఎక్కువ శాతం ఉంటుందని అన్నారు.
అందువల్ల ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి అని, వారి సెలవులను ఎఫ్ఆర్ఎస్ యాప్ తో లింక్ చేయాలని విద్యాధికారులను ఆదేశించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరును రివ్యూ చేయాలని, మండల విద్యాధికారులు ప్రాథమిక పాఠశాలలను తరచుగా తనిఖీ చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలలను విధిగా సందర్శించాలని ఆదేశించారు.
70 శాతానికి తక్కువ కాకుండా క్షేత్రస్థాయి సందర్శనలు ఉండాలని ఆదేశించారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు గణిత సామర్ధ్యాల స్థాయిని పెంచాలని, మోడల్స్ స్కూల్లో ప్రగతిని పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీసర్ ను నియమించాలని డీఈవోను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, జీసీడీఓ కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


