ప్రజావాణిలో వినతుల వెల్లువ
ఉమ్మడి జిల్లాలో సమస్యలపై అధికారుల ఫోకస్
నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని కలెక్టర్ల ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్/పెద్దపల్లి /జగిత్యాల /రాజన్న సిరిసిల్ల : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు భారీగా ప్రజలు తరలివచ్చి తమ వినతులను అధికారుల ముందుంచారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్వయంగా అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలపై కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేస్తూ సమస్యల పరిష్కారంలో జాప్యం సహించబోమని హెచ్చరించారు.
కరీంనగర్ లో 367 వినతులు
కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ కలిసి 367 దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించిన 41, గృహ నిర్మాణ శాఖకు చెందిన 37 వినతులు నమోదయ్యాయి. ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యంతో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లిలో భూ సమస్యలు, అక్రమ నిర్మాణాలపై ఆదేశాలు
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అసైన్మెంట్ భూముల పట్టాలు, అక్రమ నిర్మాణాల తొలగింపు, పట్టాదారు పుస్తకాల జారీ వంటి సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్లలో 154..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుండి 154 దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 72 వినతులు వచ్చాయి. గత ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు.
జగిత్యాలలో 36 ఫిర్యాదులు
జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుండి 36 ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి చట్టపరంగా న్యాయం చేయాలని ఆదేశించారు.


