రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన పోలీసులు
విజేతలను అభినందించిన రామగుండం సీపీ
క్రీడలకు పూర్తిస్థాయి ప్రోత్సాహం ఉంటుందని హామీ
కాకతీయ, పెద్దపల్లి: రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ఇటీవల ముగియగా ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన రామగుండం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులను కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలకు సమయం కేటాయించే పోలీస్ సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు. క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధన ద్వారానే విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని, విధి నిర్వహణలో క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో కాలేశ్వరం జోన్ నుంచి 150 మంది పాల్గొనగా అందులో 30 మంది క్రీడాకారులు మొత్తం 23 పతకాలు సాధించారు. వీటిలో 7 బంగారు, 8 వెండి, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 15 మంది, ములుగు జిల్లా నుంచి 5 మంది, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి 6 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 4 మంది క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్‌ఐలు శేఖర్, పెద్దన్న, సీసీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.


