పంతులుపల్లి పాఠశాల తనిఖీ
కాకతీయ. నల్లబెల్లి; నాగరాజుపల్లి పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలను నల్లబెల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎం అంబి వసంత సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని, విద్యార్థుల విద్యా సామర్థ్యాలను సమీక్షించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ బోధన, పాఠ్యపుస్తక బోధన, వర్క్‌బుక్ నిర్వహణ, పీటీఎం నిర్వహణ రిజిస్టర్, ఎండీఎం నిర్వహణతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.
విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. త్వరలో జరగనున్న ఎఫ్‌ఎల్‌ఎన్ శాంపిల్ సర్వే నేపథ్యంలో విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. అలాగే ఎఫ్‌ఎల్‌ఎస్‌లో మంచి ఫలితాలు సాధించేలా మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
పాఠశాల రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి పాల్గొన్నారు.


