వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ శిక్షణ ప్రారంభం
తాడికల్ రైతు వేదికలో ఐదు రోజుల ఓరియంటేషన్
12 గ్రామాల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఇటీవల ఎన్నికైన వార్డు సభ్యులకు తాడికల్ రైతు వేదికలో పంచాయతీరాజ్ చట్టం–2018పై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఎంపీఓ కాసగోని ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ జనరల్ ఓరియంటేషన్ శిక్షణ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కొనసాగనుంది.
మొదటి విడతలో చింతకుంట, అంబాలపూర్, గొల్లపల్లి, ఇప్పలపల్లి, కరీంపేట, కేశవపట్నం, కొత్తగట్టు, లింగాపూర్, మెట్పల్లి, తాడికల్, వంకాయగూడెం, ఎరడపల్లి గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు పాల్గొన్నారు. పంచాయతీ పరిపాలన, బాధ్యతలు, అధికారాలు, సమావేశాల నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.
ఈ శిక్షణ ద్వారా గ్రామస్థాయిలో పారదర్శక పాలన, సమర్థ సేవలందింపునకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


