ప్రజా సంక్షేమమే పాపన్న గౌడ్ పాలన
వావిలాలలో ఘనంగా పాపన్న విగ్రహ ఆవిష్కరణ
స్ఫూర్తిదాయక నాయకుడిగా కొనియాడిన నేతలు
కాకతీయ, నెల్లికుదురు : తెలంగాణ ప్రాంతంలో గోల్కొండకు తొలి స్వదేశీ హిందూ రాజుగా పరిపాలన అందించి ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పాలించిన మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కల్లు గీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు రమణ అన్నారు. మండలంలోని వావిలాల గ్రామంలో ఆదివారం స్థానిక సంఘం అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయ వారసత్వం లేకుండానే గౌడ కులంలో జన్మించిన పాపన్న చిన్ననాటి నుంచే అన్యాయాలను ఎదుర్కొనే ధైర్యసాహసాలతో ఎదిగిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. పాపన్న స్ఫూర్తితో సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విగ్రహ దాతలు కందిమల్ల సతీష్, నూనావత్ నరేష్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేజీకేఎస్ నాయకులు బి.వెంకటేశ్వర్లు, గౌని వెంకన్న, యమగాని వెంకన్న, వీరగామి మల్లేశం, మద్దెల శోభన్ గౌడ్, దేశగాని యాకన్న గౌడ్, బొల్లెపెల్లి సతీష్ గౌడ్, గుండగాని చిన్న వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


