వానరాల బెడదకు ఎలుగుబంటి ‘అస్త్రం’
మాస్క్ చూసి పరుగులు పెట్టిన కోతులు
కరీంపేట పంచాయతీ వినూత్న ప్రయత్నం
కాకతీయ, శంకరపట్నం : కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఉపశమనం కల్పించేందుకు కరీంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న చర్య చేపట్టింది. ఇండ్లపైకి ఎక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్న వానరాలను తరిమేందుకు ఎలుగుబంటి వేషాన్ని ఆశ్రయించింది. గ్రామంలో పెరిగిపోతున్న కోతుల సంఖ్యతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎలుగుబంటి మాస్క్‌ను తెప్పించింది. ఆ మాస్క్‌ను ఓ వ్యక్తికి ధరింపజేసి గ్రామంలోని పలు వార్డుల్లో తిరిగించారు. ఎలుగుబంటి రూపాన్ని చూసిన కోతులు భయంతో చెదరిపోయి పరుగులు పెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వినూత్న చర్య తాత్కాలికంగా మంచి ఫలితాలివ్వడంతో గ్రామస్థులు పాలకవర్గాన్ని అభినందిస్తున్నారు. కోతుల సమస్యను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి మరిన్ని మాస్క్‌లు తెప్పించి అవసరమైన చర్యలు చేపడతామని సర్పంచ్ ఏగ్గని శ్రీలత, ఉపసర్పంచ్ చింతం రాజేశం, వార్డు సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ఇలాంటి సృజనాత్మక చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


